24-12-2025 12:50:25 AM
క్వారీలను రద్దు చేయాలని తహసీల్దార్‌కు ఆదివాసి సంఘాల వినతి...
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 23(విజయక్రాంతి):ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను తుంగలో తొక్కి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తూ, అక్రమంగా డంపింగ్ చేస్తున్న క్వారీలను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వెంకటాపురం మండల తహసీల్దార్కు వివిధ ఆదివాసి సంఘాల ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.
గిరిజన సహకార సంఘాలకు (సొసైటీలకు) మంజూరైన ఒంటిచింతల, అబ్బాయిగూడెం, మొర్రవానిగూడెం, వీరభద్రవరం క్వారీల్లో పీసా చట్టం, బైలా నిబంధనల ప్రకారం స్థానిక ఆదివాసులకే ఉపాధి కల్పించాలి. కానీ, దీనికి విరుద్ధంగా రైజింగ్ కాంట్రాక్టర్లు యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు.పట్టపగలే భారీ యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంపింగ్ చేస్తున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదని నాయకులు ఆరోపించారు.
పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయని వారు విమర్శించారు.జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడుతున్న క్వారీలను రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్ర రావు, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, కార్యదర్శులు కూచింటి చిరంజీవి, చింత సోమరాజు, తాటి లక్ష్మణరావు, మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.