19-09-2025 12:00:00 AM
అరికట్టాలని పాదయాత్ర : సీపీఎం
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 18( విజయ క్రాంతి) :అక్రమ మట్టి మైనింగ్ మాఫియాను అరికట్టాలని ఈనెల 22వ తేదీన జమలాపురం దేవస్థానం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావులు తెలియజేశారు .
మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనము నందు పాత్రయాత్రకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు.పాదయాత్ర ఎనిమిది గంటలకు మండలంలో గల అన్ని గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు తెలిపారు. మండలంలో గల ప్రకృతి సంపద ఏమైపోతుందో మండలం ఎటు పోతుందో అర్థం కావడం లేదని ఆవేదన వెళ్ళబుచ్చారు.
అధికారం ముసుగులో అధికారుల అండదండలతో మమ్మల్ని ఆపేదెవరు అడ్డగించేవారు ఎవరు అంటూ తమ ఇష్టానుసారముగా ప్రభుత్వ సంపద,అటవీ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. అక్రమ ఆదాయం కోసం గ్రావెల్ మాఫియా కొండలను కబళిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని అన్నారు.
నిబంధనలకు పాతరేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తూ మట్టి మాఫియా ఆగడాలను అరికట్టే వారు లే కపోవడంతో సిపిఎం పార్టీ ఆ బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పాదయాత్ర నిర్వహిస్తుందని మండల ప్రజలు అర్థం చేసుకొని మా పోరాటానికి మద్దతు తెలపాలని పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి అక్రమ మట్టి మాఫియా పై వారికి సహకరిస్తున్న బాధ్యత కలిగిన అధికారులపై చర్యలు చేపట్టే వరకు ముట్టడి కార్యక్రమాన్ని విరమించేది లేదని హెచ్చరించారు.
తహసిల్దార్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పాదయాత్రకు ప్రజలు సహకరించాలని ప్రజలు పె ద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. భీమవరం రెవిన్యూ పరిధిలో గల 190 సర్వే నెంబర్ లో గల రైతులు మండల సర్వేయర్ నిర్వహించిన సర్వేకు ఎటువంటి అభ్యంతరం తెలపకపోయిన తిరిగి మరల జిల్లా సర్వేర్ తో సర్వే చేయించాల్సిన అవసరం తాసిల్దార్ కు ఎందుకు వచ్చిందో తెలపాలని ప్రశ్నించారు.
పూర్ణచంద్రారెడ్డి దౌర్జన్యంగా 190 సర్వే నెంబర్ లో గల భూములకు ఏర్పాటు చేసిన పెన్సింగ్ రాళ్ళను తొలగించడానికి తహసిల్దారుకు ఇష్టం లేనట్లుగా కనపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు,సగుర్తి సంజీవరావు, నాగులవంచ వెంకట్రామయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు