calender_icon.png 7 October, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు

07-10-2025 01:04:16 AM

దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య, చిరంజీవులు, వీహెచ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెం 9 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్‌రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.

గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా 50 శాతానికి మించి ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో రాష్ర్టంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి.