29-10-2025 12:28:20 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,అక్టోబర్ 28(విజయక్రాంతి): నైపుణ్యతను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని సుప్రభాతం పాఠశాలలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం క్రింద నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ -ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా నైపుణ్యత శిక్షణ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యత శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ జి ఎం ఎం, సాహితీ సంస్థ వారు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు.
ఈ శిక్షణలో కంప్యూటర్ ఆంగ్లభాషపై అవగాహన, ఇతర నైపుణ్యతలపై ఇచ్చే శిక్షణను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని, జీవితంలో స్థిరపడాలని తెలిపారు. దేశంలో ప్రైవేటు రంగంలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని తెలిపారు. అంతరం అభ్యర్థులకు నైపుణ్యతా శిక్షణ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తరాం, తహసిల్దార్ మధుకర్, ఈ జి ఎం ఎం, సాహితీ సంస్థ ప్రతినిధులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.