calender_icon.png 26 January, 2026 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి

26-01-2026 12:55:06 AM

  1. జాతీయ ఓటరు దినోత్సవంలో వక్తల పిలుపు 

ఓటింగ్ లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలని హితవు 

నిజామాబాద్, జనవరి 25(విజయ క్రాంతి) : ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలని వక్తలు సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ప్రతీసారి వినూత్న పద్దతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపోందిస్తుందని అన్నారు.

ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా - మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని అన్నారు. స్వేచ్చాయుత  వాతావర ణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. పలు దేశాలలో ఓటింగ్ లేకుండా నియంతృత్వ పాలన జరుగుతోందని, అందుకు భిన్నంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ భారత దేశంలో స్థానిక సంస్థలు మొదలుకుని పార్లమెంటు వరకు క్రమం తప్పకుండా పకడ్బందీగా ఎన్నికలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతుందని సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 1951లో అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలోనూ అందరినీ ఓటింగ్ లో భాగస్వామ్యం చేసేందుకు అప్పటి భారత ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నేతృత్వంలో ఎలక్షన్ సింబల్ ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికలను కూడా అదే స్పూర్తితో నిర్వహించాలని, ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.18 ఏళ్ళు నిండిన వెంటనే ఓటరుగా నమోదు అయ్యేలా ఎలక్షన్ కమిషన్ యువతకు వెసులుబాటు కల్పించిందని సూచించారు.

ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా పద్దెనిమిదేళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసా దించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున, ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహూకరించి సత్కరించారు. కొత్త ఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 25 (విజయక్రాంతి): ఓటరుగా అర్వత పొందిన ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా రెవిన్యూ ఆధనం కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువతను అధికారికంగా హోటల్గా నమోదు చేసుకున్న ఉద్దేశంతో వారి లెటర్స్ ఫోటో ఐడెంటి కార్డులు పదిమందికి పంపిణీ చేశారు.

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఏపీ కాళ్లు పంపించడంతోపాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, తాసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట్లో ఘనంగా 16వ నేషనల్ ఓటర్ డే

నాగిరెడ్డిపేట్, జనవరి 25 (విజయ క్రాంతి): మండలంలోని మాసానిపల్లి,గోలిలింగాల, లింగంపల్లి, మాల్తుమ్మెద, జలా ర్పూర్, ధర్మారెడ్డి తదితర గ్రామాల్లో 16వ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు ఆధ్వర్యంలో గ్రామస్తులు, గ్రామ ప్రజలు,యువకులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు భారతదేశ పౌరులమైన మన ము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో,మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం,వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్ గౌడ్,సునంద కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణ,బుర్రకాయల రోజా, అనిత గోపాల్ గౌడ్, సాయిలు, ఓటర్లు పాల్గొన్నారు.

ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి 

కామారెడ్డి అర్బన్, జనవరి 25(విజయ క్రాంతి): ఓటు హక్కును నిజాయితీగా, నిర్భయంగా వినియోగించుకోవాలని మాజీ జడ్పీటీసీ సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. ఆదివారం దోమకొండలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి-యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలో 

కామారెడ్డి, జనవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జాతీయ ఓటర్ దినోత్సవం 2026 సందర్భంగా పలు కార్యక్రమా లను అధికారులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ దినోత్సవ ర్యాలీ లు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను చేపట్టారు. కామారెడ్డి  జిల్లా కేంద్రంలో నిజాం సాగర్  చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అదనపు కలెక్టర్ విక్టర్, మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ఓటర్లు ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి  ఆర్డీఓ వీణ,తహసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,డిస్ట్రిక్ట్ స్పోర్ట్సఆఫీసర్ రంగా వెంకటేశ్వర్ గౌడ్, RK కాలేజీ సీఈవో జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ దత్తాద్రిరావు, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ , ఎన్సీసీ క్యాడెట్లు, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, ఐకెపి మహిళలు, బీ.ఎల్.ఓ.లు, వివిధ కళాశాలలో విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు.