26-01-2026 02:30:59 AM
కామారెడ్డి, జనవరి 25 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మార్గమధ్యలో ఆదివారం కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులోని దేశాయ్ బీడీ కంపెనీ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రాబోయే రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కామారెడ్డి జిల్లా రైతాంగానికి వరప్రదాయిని అయిన ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు.
జిల్లాలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనుల గురించి షబ్బీర్ అలీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వివరించారు.పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుం దన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో విజ యం సాధించాలని చర్చించారు.
పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్ధo ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నిమ్మ మోహన్‌రెడ్డి, గోనె శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్‌యాదవ్, ప్రజాప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.