17-07-2025 12:02:07 AM
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో ప్రేక్షకుల ముందుకొస్తున్న రూరల్ కామెడీ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలతో అనుబంధం ఉన్న నటి, చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మిస్తోంది. మనోజ్‌చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్, ప్రీమియర్ షో ఏర్పాటుచేసింది. అనంతరం టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఈ సినిమా నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు పాత్రలన్నీ చాలా సజీవంగా కనిపించాయి. మనకు తెలిసిన పాత్రలే.. మన చుట్టూ ఉన్న పాత్రలే అనిపించాయి. డైరెక్టర్ ప్రవీణ కార్డియాలజిస్ట్. తను ప్రాక్టీస్ చేస్తూనే ఈ సినిమా తీశారు.
మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక సినిమా చేయాలంటే అన్నీ వదిలేసుకుని రావాలనే ఒక ఆలోచనకు భిన్నంగా వాళ్లు ఈ సినిమాను తీశారు. ప్రవీణ ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మనోజ్ స్క్రీన్ మీద చాలా నచ్చాడు” అని చెప్పారు. హీరో మనోజ్‌చంద్ర మాట్లాడుతూ.. “కష్టపడి నిజాయితీగా ఒక సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. మీ స్పందన అదిరిపోయింది” అని తెలిపారు.
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “నిర్మాతగా ఇది నా మూడో సినిమా. డైరెక్టర్‌గా మొదటి సినిమా. కంచరపాలెం సినిమాను థియేటర్లలో మిస్సయ్యా మని చాలా మంది చెప్పారు. ప్రేక్షకుల మీద నమ్మకంతో తీసిని ఈ సినిమా మాత్రం థియేటర్లలో మిస్ అవ్వొద్దు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు రవీంద్ర విజయ్, బెనర్జీ, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.