24-09-2025 12:55:52 AM
మణికొండలో పురపాలక సిబ్బందికి మాజీ చైర్మన్ వస్త్రదానం
మణికొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఆ తండ్రి భౌతికంగా దూరమైనా, ఆయన ఆశయాలు సేవారూపంలో బతికే ఉన్నాయి. కన్నతండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఓ కొడుకు చూపిన సేవా నిరతి, మణికొండలో మానవత్వపు పరిమళాలను వెదజల్లింది. వివరాల్లోకి వెళితే, మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, తన తండ్రి కీర్తిశేషులు సత్తయ్య కస్తూరి నరస్మామ ‘ స్మారకార్థం మంగళవారం ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక శివాలయం ప్రాంగణంలో మణికొండ పురపాలక సంస్థ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తండ్రి బాటలో నడుస్తూ కస్తూరి నరేందర్ సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని, యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం కస్తూరి నరేందర్ మాట్లాడుతూ తన తండ్రి ఎప్పుడూ పేదల సేవలో ముందుండేవారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు తాను ఇచ్చే నిజమైన నివాళి అని భావోద్వేగంగా తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పలువురు స్థానిక నాయకులు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.