12-08-2025 01:35:46 AM
బీసీ బిల్లుపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవటంతో కాంగ్రెస్ నిర్ణయం!
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గరపడుతుండటం, మరోవైపు గ్రామాల్లో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో పల్లెల అభివృద్ధి నిలిచిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. స్థాని క సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ ఏర్పాటు చేసే పీఏసీ సమావేశంలో మెజార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో పాటు రాష్ట్ర క్యాబినెట్‌లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. బీసీ సంఘాలతో కలిసి ఢిల్లీలోనూ ధర్నా చేపట్టారు.
అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీపరంగా బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌ను హస్తగతం చేసుకోవాలి..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై సమవే శంలో చర్చించారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చారు. జనహిత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అవసరమైన పరిష్కారాలపై చర్చించారు. ఇక ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకె ళ్లాలనే అంశాలపైనా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చర్చించారు.
ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయానికి వచ్చారు. పార్టీ పదవులును కూడా భర్తీ చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్‌లో మరిం త ఉత్సాహంతో పని చేస్తుందని భావిస్తున్నారు.