30-08-2025 01:01:00 AM
ఏడుగురు నిందితులు అరెస్ట్
రూ.2.32 లక్షలు, ఎర్టీగా కారు స్వాధీనం
నకిరేకల్లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి
నకిరేకల్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): నకిరేకల్ కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బు దొంగిలించిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిందితుల వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా యాగర్లపల్లి మండలానికి చెందిన పురుపురెడ్డి నాగ, పట్నాల పోలమ్మ, పోరిపిరెడ్డి చాందిని, యరసాని సంధ్య, పురుపురెడ్డి మోషే, ఒక బాలిక, ఒక బాలుడు అను ఏడుగురు వ్యక్తులు ఈ నెల 26వ తేదీ నకిరేకల్ పట్టణంలోని కోఆపరేటివ్ ట్యాంకుకు చేరుకున్నారు.
అదే సమయంలో నకిరేకల్ మండలం నడిగూడెం గ్రామానికి చెందిన మాద నాగరాజు బంగారం లోన్ క్లీయర్ చేయడానికి రూ.3 లక్షల రూపాయలను కవర్లో తీసుకొని వచ్చాడు. నాగరాజు ఓచర్ రాస్తుండగా నిందితులు అతడితో మాటామాటా కలిపి బ్లేడుతో కవర్ ను కోశారు. అందులో రూ.2.50 లక్షల డబ్బును దొంగిలించి అక్కడి నుండి వెళ్లిపోయారు. నాగరాజు ఓచర్ రాసుకుని తేరుకుని చూసేసరికి కవర్లో డబ్బు దొంగిలించాడని లబోదిబో అంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నకిరేకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వేర్వేరు ప్రదేశాలలో నేరస్తుల కోసం తనిఖీలు చేపడుతుండగా బైపాస్ లోని నగేష్ హోటల్ సమీపంలో సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఎర్టీకా కారులో ఏడుగురు వ్యక్తులను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి విచారించారు. బ్యాంకులో దొంగతనం చేసిందని తామేనని ఒప్పుకున్నారు.
డబ్బుతో ఆరోజు విజయవాడకు వెళ్లి రాత్రి కనకదుర్గమ్మ గుడిలో పడుకుని, తరువాతి రోజు విజయవాడలోనే ఉండి మూడోరోజు కోదాడ బస్టాండ్ లో పడుకున్నారు. మరల ఎక్కడైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో చిట్యాల, చౌటుప్పలలో చేయాలని నిర్ణయించుకుని వస్తున్న సమయంలో పట్టుబడ్డారు. వారి నుండి రూ.2,32,000, ఎర్టికా కారు, రెండు సెల్ఫోన్లు, ఒక బ్లెడులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన సీఐ వెంకటేష్ ,ఎస్‌ఐలు లచ్చిరెడ్డి, కృష్ణామాచారి, సిబ్బంది వై.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్, డి. శ్రీకాంత్, వి. సురేష్, కె. జనార్దన్, బి. మధుకర్, జె.లక్ష్మీలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అబినందించారు..