calender_icon.png 20 November, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య శ్రీ పేరుతో.. అవయవాలు మాయం

16-08-2024 02:05:04 AM

  1. అంబులెన్స్ డ్రైవర్ల మాస్టర్ ప్లాన్
  2. రోడ్డు ప్రమాద బాధితుడి కుటుంబ సభ్యులను మభ్యపెట్టి తమకు అనుకూలమైన ఆసుపత్రిలో చేర్పించిన ఘనులు
  3. బాధితుడు బతకడం కష్టం అంటూ అవయవదానానికి ఒప్పించిన వైనం
  4. విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

మంచిర్యాల, ఆగస్టు 15(విజయక్రాంతి): జైపూర్ మండలంలోని షెట్‌పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్ ఈనెల 6న బైక్‌పై మంచిర్యాలకు వెళ్తున్న క్రమంలో ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌కు మంచిర్యాలలోని ఓ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో  ముగ్గురు వ్యక్తులు శ్రీకాంత్ స్నేహితులమని అతడి భార్య స్వప్నకు చెప్పి అంబులెన్స్‌లో ఎక్కారు. అయితే పథకం ప్రకారం ఎక్కిన వారు మంచిర్యాల వైద్యులు సూచించిన ఆసుపత్రికి కాకుండా కెల్విన్ అసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. తలకు బలమైన గాయమవడంతో బ్రెయిన్‌లో నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ క్రమంలో కరీంనగర్ నుండి వేరే అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఓ కార్పోరేట్ ఆసుపత్రి నుంచి స్వప్నకు ఫోన్‌చేసి యశోద ఆసుపత్రిలో వైద్యఖర్చులు ఎక్కవ అవుతాయని, కామినేనికి రావాలని.. ఆరోగ్య శ్రీ పథకం అందుబాటులో ఉందని చెప్పారు. వారి మాటలు నమ్మిన స్వప్న.. భర్త శ్రీకాంత్‌ను కామినేనిలో చేర్పించగా.. వైద్యం అందించిన ఒకరోజు తరువాత.. శ్రీకాంత్ బ్రెయిన్ చెడిపోయిందని బతకడం కష్టమని కుటుంబ సభ్యులకు చెప్పారు.

అయితే పథకం ప్రకారం అంబులెన్స్ డ్రైవర్లు, మరికొంతమంది శ్రీకాంత్ భార్యను అవయవదానం చేసేందుకు ఒప్పించారు. తదనంతరం శ్రీకాంత్ అవయవాలను ఓ సంస్థకు అప్పగించి రూ.3 లక్షలు స్వప్నకు ఇచ్చారు. అయితే ఇదంతా ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. ఈ అవయవదానం ఎపిసోడ్‌లో అంబులెన్స్ డ్రైవర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయనే చర్చ జరుతుండగా.. ఆనోటా.. ఈనోటా పడి మృతుడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో శ్రీకాంత్ భార్య స్వప్న మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.