17-01-2026 03:49:51 AM
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): కోదాడలోని కర్ల రాజేష్ లాకప్‌డెత్ విషయంలో హోంగార్డు నుంచి ఎస్సీ వరకు నిందితులుగా ఉన్నారని, వాటన్నింటికి తాము ఆధారాలతో సహా రుజువు చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆరోపించారు. పోలీస్ యంత్రాంగమంతా నిందితులైన పోలీసులను కాపాడుతోందన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో చిలుకూరు ఎస్సు సురేష్ రెడ్డిపై ఏ 1. కోదాడ సీఐ ప్రతాప్ లింగంపై ఏ2గా అక్రమ నిర్బంధం, చిత్రహింసలకు గురిచేయడమనే అంశంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కృష్ణమాదిగ తెలిపారు.
రాజేష్ లాకప్‌డెత్‌కు సంబంధించిన ఆధారాలు కనుమరుగు చేసే ప్రయత్నం చేసిన కోదాడ డీఎస్పీ, శ్రీధర్ రెడ్డి ని ఏ3 గా, సూర్యాపేట ఎస్పీ నరసింహని ఏ4 గా చేర్చి కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యాపేట జిలా పోలీసు యంత్రాంగం మొత్తం ఒకే ఒక్క పనిమీద నిమగ్నమైందని, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని పనిలోనే ఉన్నారని కృష్ణమాదిగ పేర్కొన్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి పోస్టుమార్టం మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో నిర్వహించకుండా, చిలుకూరు ఎస్సు, కోదాడ సీఐల పర్యవేక్షణలో లక్ష్మీకాంతరెడ్డి అనే డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించడంలోనే అసలు కుట్ర దాగుందన్నారు.
ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా సిట్టింగ్ జడ్జితో రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు. ప్రత్యర్థులపై సీబీఐ విచారణ కోరుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, దళిత బిడ్డ రాజేష్ లాకప్‌డెత్‌పైన ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈనెల 18న సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్,అనుబంధ సంఘాల రాష్ర్ట సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.