03-11-2025 11:13:24 PM
							ఎకారకు 7 క్వింటాళ్ల పత్తినే..
కొనుగోలు చేస్తామంటే రైతులకు తీవ్ర నష్టం
20 శాతం తేమ వరకు పత్తిని కొనుగోలు చేయాలి
కేంద్రానికి, సీసీఐకి మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనలను సడలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం లేఖలు రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ తాజాగా నిబంధన విధించడం వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం చేస్తోందన్నారు. ఇప్పటీ వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడం జరుగుతోందని, జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం ఎకరాకు 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడులు నమోదయ్యాయని మంత్రి వివరించారు.
ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు కొత్త నిబంధనలతో పత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన లేఖ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతాంగా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పాన విధానంలోనే పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆ తర్వాత పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయ్ తదితరులు పాల్గొన్నారు.