21-05-2025 06:16:10 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేశవరావు మరణించినట్లు అమిత్ షా ఎక్స్ లో ప్రకటించారు. బుధవారం ఉదయం నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి.
ఈ భారీ ఎన్ కౌంటర్ లో కేశవరావుతో సహా 27 మంది మావోయిస్టులు మరణించారు. అతడిపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయవంతమైందని పేర్కొన్నారు. సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు నంబాళ్ల నక్సల్స్ ఉద్యమానికి వెన్నముకగా ఉన్నాడని, ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్ కౌంటర్ లో మరణించడం 30 ఏళ్లలో తొలిసారి అని పేర్కొన్నారు.
నక్సలిజం అంతమొందించే లక్ష్యంలో బీజేపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ఈ ప్రధాన పురోగతికి ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని అమిత్ షా స్పష్టం చేశారు.