calender_icon.png 22 May, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్టీఎల్ లో దర్జాగా నిర్మాణం..

21-05-2025 06:12:30 PM

భౌరంపేట్ రాంజీ కుంట ఎఫ్టీఎల్ లో సన్ షైన్ నిర్మాణం..

సర్వే నెంబర్ 562లో కుంట.. 

కుంట పక్కనే సర్వే నెంబర్ 536 లో సన్ షైన్ నిర్మాణం..

రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అండతోనే అంటూ ఆరోపణలు..

హైడ్రా చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయంలో చెరువులు, కుంటలు ఆక్రమణదారుల చేతుల్లో కనుమరుగయ్యాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కాపాడేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా(Hydra) అనే సంస్థను తీసుకువచ్చినా కూడా కొన్ని బడా నిర్మాణ సంస్థలు ఇంకా చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. నగరంలో ఆక్రమణదారులు చెరువులు, కుంటలను హైడ్రా ఉన్నాసరే మింగేస్తున్నారు. అయినా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపమో లేక అక్రమార్కులతో లోపాయి కారు ఒప్పందాలో కానీ చెరువులను చెరబడుతున్న కబ్జాదారుల విషయంలో అన్ని శాఖల అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

అయినా సరే అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు. వీరి సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు కబ్జాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు నగర ప్రజల దాహాన్ని తీర్చిన చెరువులు ఇప్పుడు క్రమంగా తమ ఉనికి కోల్పోతున్నాయి. మరికొన్ని మురుగునీటితో మునిగిపోతున్నాయి. కొన్ని బడా గృహ నిర్మాణ సంస్థలు అధికారులను తమ చేతుల్లో పెట్టుకొని ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయి. తామేం చేసిన చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాయి. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, చట్టాలను బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ రాంజీ కుంట ఎఫ్టిఎల్ లో సన్ షైన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(Sunshine Infra Private Limited) అనే గృహ నిర్మాణ సంస్థ చేపడుతున్న అక్రమ నిర్మాణం బయట పడింది.

సర్వే నెంబర్ 562 లో ఉన్న రాంజీ కుంటని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 536లో ఈ సంస్థ అక్రమ కట్టడం కొనసాగిస్తోంది. పక్కనే కుంట ఉండడంతో ఫుల్ ట్యాంక్ లెవల్ నుండి పాటించాల్సిన దూరం పాటించి నిర్మాణం చేపట్టాలి. అలా చేయకుండా నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఎఫ్టిఎల్ లోనే నిర్మాణం సాగిస్తున్నాడు. ఇక ఈ బడా గృహ నిర్మాణ సంస్థకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అండ పుష్కలంగా ఉందంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారి అండతోనే సన్ షైన్ ఇంతకు బరితెగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్యాయాలకు అలవాటు పడిన అధికారులు చెరువులు, కుంటలను, ప్రభుత్వ స్థలాలను కాపాడటంలో విఫమవుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. హైడ్రా అధికారులు దృష్టి సారించి సన్ షైన్ చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణంపైన అలాగే నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మాకేం సంబంధం లేదు.. ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేయండి..

తహసీల్దార్ సయ్యద్ మతిన్..

సన్ షైన్ కుంట ఎఫ్టీఎల్ లో చేపడుతున్న నిర్మాణంపై మండల తహసీల్దార్ సయ్యద్ మతిన్ ను వివరణ కోరగా... ఆ నిర్మాణం గురించి మాకేం సంబంధం లేదని, ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేయండని బదులిచ్చారు.