02-09-2025 12:23:01 AM
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి):సరళమయిన మూడు పంక్తుల్లో జీవన తాత్వికతను ఆవిష్కరించిన కవిత్వం వారాల ఆనంద్ రాసిన ‘త్రివేణి’ అని పలువురు సాహితీవేత్తలు అన్నారు. గంగా యమునా నదుల్లా మొదటి రెండు పంక్తులు ప్రవహిస్తే మూడో పంక్తి సరస్వతిలా ప్రవహించిందని అన్నారు. సోమవారం కరీంనగర్ కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘త్రివేణి కవితా సంకలనాన్ని85 ఏండ్ల మాజీ హిందీ ఉపాధ్యాయుడుశ్రీ ఉడుతల రాజేశం ఆవిషరించారు.
వారాల ఆనంద్ తనకు స్కూల్లో హింది బోధించిన ఆయన నడవలేని స్థితిలో కూడా స్కూలుకు వచ్చి తన శిష్యుని పుస్తకాన్ని ఆవిష్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి స్కూలు ప్రధానాచార్యుడు అధ్యక్షత వహించారు. త్రివేణి పుస్తక సమీక్ష చేసిన సాహితీ విమర్శకురాలు శ్రీమతి కల్వకుంట్ల శ్రీలత మాట్లాడుతూ త్రివేణి కవితల్లోని తాత్వికతను వివరించారు. ఆలతి ఆలతి మాటల్లో రాసిన మూడు పంక్తుల కవితల్లో జీవిత సారాంశాన్ని ఆవిష్కరించారన్నారు. అంతే కాదు వర్తమాన జీవితాల్లో సామాజిక మాధ్యమాలు సాధారణమయిన సందర్భంలో చిన్న కవితలు యువతని ఎక్కువగా ఆకట్టుకుంటాయన్నారు. అంతే కాదు కవితలు రాయాలనుకునే కొత్త తరానికి ‘త్రివేణి’కవితలు మార్గనిర్దేశం చేస్తాయనిఅన్నారు.
యువత మనమూ రాయొచ్చనే ధైర్యాన్నిస్తాయని అన్నారు. తెలుగు కవిత్వంలో కొత్త ఆనంద్ ప్రక్రియను ఆరంభించాన్నారు. సాహితీ వేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు మాట్లాడుతూ మనసు దండెంపై నిలబడ్డ మూడు పక్షుల్లా కవి, ప్రకృతి,సమాజమూ ప్రతిబింబించేలా త్రివేణి వుందన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కవిత్వం జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తుండన్నారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ నిర్వహించిన ఆ కార్యక్రమంలో కవి వారాల ఆనంద్ తో విద్యార్థులతో ముఖాముఖి అనేక ప్రశనల్తో వినూత్ననంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నలిమేల బాస్కర్, కె.ఎస్.అనంతాచార్య, పి.ఎస్.రవీంద్ర, సంకెపెళ్ళి నాగేంద్ర శర్మ, శ్రీనివాస శర్మ, పొయెట్రీ ఫోరం కన్వీనర్ ఇందిరా రాణి మంగారి శివ ప్రసాద్, నడిమెట్ల రామయ్య, తదితరులుపాల్గొన్నారు.