08-11-2025 12:24:17 AM
షమీకి, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ
న్యూఢిల్లీ, నవంబర్ 7: నెలవారీగా తనకు భరణం, తన కుమార్తె సంరక్షణకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరుతూ భారత క్రికెటర్ మొహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయాలని టీమిండియా స్టార్ బౌలర్ షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
కోల్‌కతా హైకోర్టు గతంలో తన కోసం నెలకు రూ1.5లక్షలు, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.2.5లక్షలు మంజూరు చేసిన భరణాన్ని పెంచాలని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నెలకు తమకు రూ.4లక్షలు సరిపోవడం లేదని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో స్పందించాలని మొహ్మద్ షమి, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ గడువు ముగిసిన తర్వాత ఈ కేసు విచారణకు రానుంది. షమి, హసీన్ జహాన్‌కు 2014లో పెళ్లి కాగా, 2015లో ఐరా జన్మించింది. తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. మా ఇద్దరికి నెలనెలా ఇస్తున్న రూ.4లక్షలు ఇప్పుడు సరిపోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.