04-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఎడ్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో తమ కోటా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకమీదట డీఎస్సీ ద్వారా చేపట్టే ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 70 శాతానికి తగ్గకుండా స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తుండటంతో నష్టపోతున్నామని, ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కోటాను 70- 80 శాతానికి పెంచాలని బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న విధానంతో బీఎడ్ కోర్సు చేసిన, చేయబోయే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఏ టీచర్ పోస్టులను బీఎడ్ అభ్యర్థులతోనే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సచివాలయ ముట్టడికి తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం పిలుపునిచ్చింది.
ఇతర రాష్ట్రాల్లో నేరుగా భర్తీ..
కేరళతోపాటు కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారానే ఎస్‌ఏ టీచర్ పోస్టులను 70 శాతం వరకు భర్తీ చేస్తున్నారు. కేరళ రాష్ట్రం పాఠశాలల్లో 75 శాతం, కేంద్రీయ విద్యాలయాల్లో 66.7 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారానే భర్తీ చేస్తుంటే మన దగ్గర ఆ పరిస్థితిలేదని బీఎడ్ అభ్యర్థులు చెబుతున్నారు. బీఈడీ అభ్యర్థులకు గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశమూ ఉండేది.
కానిప్పుడు ఎస్జీటీ పోస్టులను కేవలం డీఎడ్ వారితోనే భర్తీచేస్తున్నారు. బీఈడీ అభ్యర్థులు కేవలం ఎస్‌ఏ పోస్టులకు మాత్రమే పోటీపడే అవకాశముంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను ఎస్జీటీలతో పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం 30శాతం పోస్టులనే నేరుగా రిక్రూట్‌మెంట్ ద్వారా నింపుతున్నారు.
దీంతో భర్తీ చేసే ఎస్‌ఏ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. డీఎస్సీ-2024లో 10 వేల వరకు ఖాళీలతో టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అందులో దాదాపు 7 వేల వరకు ఎస్జీటీ పోస్టులుంటే, కేవలం 2,629 ఎస్‌ఏ పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటోంది.
గత డీఎస్సీలో గణితం సబ్జెక్ట్‌కు 28 వేలు, సోషల్‌కు 42 వేలు, జీవశాస్త్రం 34 వేల మంది చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా బీఎడ్ అభ్యర్థులు దాదాపు 4 లక్షలకు పైగా ఉంటారు. అందులో టెట్ అర్హత ఉన్నవారు మూడు లక్షల వరకు ఉంటారు. ఈక్రమం లో పోస్టులు తక్కువగా.. అభ్యర్థులు ఎక్కువ గా ఉంటున్నట్టు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంతోనే తేల్చుకుంటాం..
తమకు న్యాయం చేయాలని హైకోర్టులో కేసు వేస్తే.. ఇది పాలసీ మ్యాటర్ అని కోర్టు చెప్పింది. దీంతో ప్రభుత్వంతోనే తేల్చుకునేందుకు ముట్టడి కార్య క్రమం చేపడుతున్నాం. స్కూల్ అసిస్టెం ట్ పోస్టులను కేవలం 30 శాతం మాత్ర మే రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నా రు.
దీంతో మేము నష్టపోతున్నాం. ఉద్యోగికి ప్రమోషన్ హక్కు కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మిగ తా రాష్ట్రాల్లో 70 శాతం వరకు పోస్టుల ను నేరుగా భర్తీ చేస్తుంటే మనదగ్గరేమో చేయడంలేదు. త్వరలో వెలువడే నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతాని కి తగ్గకుండా ఎస్‌ఏ పోస్టులను నేరుగా భర్తీ చేయాలి.
ఎల్.అశోక్ చౌహాన్,
తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి