05-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పథకం మార్గదర్శకాలను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మిక సంఘం నాయకులు న్యూఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి తమ గౌరవ వేతనాన్ని పెంచాలని కోరుతూ వినవించారు. ఈ సందర్భంగా పెండింగ్ నిధుల అంశాన్ని సంఘం నాయకులు ప్రస్తావించగా ధర్మాన్ ప్రదాన్ బదులిస్తూ నిధులన్ని క్లియర్ చేశామని, కేంద్రం వద్ద పెండింగ్ లేదని తేల్చి చెప్పారు.
ఈ విషయంపై రాష్ర్ట ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.17 వేలకు పెంచాలని, కార్మిక చట్టం కింద సామాజిక భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ వసతులు కల్పించాలని కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాలను పెంచాలని కోరుతూ తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు.