calender_icon.png 7 August, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ర్టపతి విందుకు కైలాష్‌కు ఆహ్వానం

05-08-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దక్కిన అరుదైన గౌరవం

పంద్రాగస్టున ప్రత్యేక కార్యక్రమం

గోండి భాషలో ‘పండోక్న మహాభారత్ కథ’ రాసిన కైలాష్

ఆదిలాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం గౌరపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాష్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేవలం 4 నెలల్లోనే గోండి భాషలో మహా భారతం పుస్తకాన్ని రచించిన ఆయనకు పంద్రాగస్టు సందర్భంగా రాష్ర్టపతితో విందులో పాల్గొనేందుకు రాష్ర్టపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.

ఈ లేఖను సోమవారం సబ్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ సందీప్, పోస్టల్ పబ్లిక్ రిలేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్, పోస్ట్‌మెన్‌లు ప్రణయ్, సాయి, ఎంఓ మునీర్.. కైలాష్ స్వగ్రామం వాఘపూర్‌కు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కైలాష్ మాట్లాడుతూ.. రాష్ర్టపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం ఆనందంగా ఉన్నదన్నారు. తన మాతృ భాష అయిన గోండి భాషలో “పండోక్న మహాభారత్ కథ” పేరుతో మహాభారతాన్ని గోండి భాషలో అనువదించి పుస్తకాన్ని ఆవిష్కరించినట్టు తెలిపారు.

మహాభారతాన్ని గోండి భాషలో తన మొబైల్ ఫోన్ లోనే టైప్ చేశానాని తెలిపారు. అంతరించే ప్రమాదంలో ఉన్న గోండి పదాలతో ఈ పుస్తకం రాశానన్నారు. మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు నుంచి మన్నన పొందానని తెలిపారు. గోండి భాషలో మొట్టమొదటి సారిగా ఒక కృత్రిమ మేధ యాంకర్ ‘సుంగల్ తుర్పో’, ‘నెలేంజ్’ను సృష్టించి వార్తలు తయారు చేసి యూట్యూబ్‌లో ప్రచారం చేసినట్టు వెల్లడించారు.

ఇంకా అనేక కథలను తయారు చేసి కృత్రిమ మేధ ద్వారా చదివించి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసినట్టు తెలిపారు. కనుమరుగవుతున్న గొండి పదాలను ఉపయోగించి వాడుకలోకి తెచ్చి ప్రజలకు అందించానని చెప్పారు. గోండి, కొలామి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఇప్పటి వరకు 330కి పైగా పాటలు రాసి వాటిని ఏఐతో పాడించానని తెలిపారు.

తాను స్వరపరిచిన పాటలను యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్‌లలో పోస్ట్ చేశానన్నారు. ఆ పాటలు విన్న ఆదివాసీ యువతి, యువకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. అరుదైన అవకాశం దక్కడంతో వాఘాపూర్ గ్రామస్తులందరూ కైలాష్ దంపతులను సత్కరించారు.