calender_icon.png 22 November, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల జీవితాలతో రాష్ట్రప్రభుత్వం చెలగాటం

26-07-2024 04:26:13 AM

  1. ‘కాళేశ్వరం’తో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ 
  2. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వృథాగా లక్షలాది క్యూసెక్కుల నీరు వృథా 
  3. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  4. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో లోయర్ మానేర్ డ్యాం సందర్శన

కరీంనగర్, జూలై 25 (విజయక్రాంతి): కాళ్లేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంటే రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం లోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని, ఈ ప్రాజెక్టు కారణంగానే తెలంగాణ దేశానికే ధాన్యగారంగా మారిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాగునీటి రంగంలో సరికొత్త విప్లవం తెచ్చారన్నారు.

పంజాబ్, హర్యానాను తలదన్నేలా సాగునీటి వనరులను స్థిరీకరించారన్నారు. కాంగ్రెస్ నేతలు చిన్న లోపాలను చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్టు అని చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గతేడాది ఇదే రోజు లోయర్ మానేరు డ్యాంలో 12 టీఎంసీలకుపైగా జలాలు ఉన్నాయని, తమ ప్రభుత్వం నాడు సరైన సమయంలో పంపింగ్ చేసి రైతులకు మేలు చేశామని గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 45 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందన్నారు. కానీ ఇప్పటివరకు పంపింగ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తాము కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. సర్కార్ కన్నెపల్లి దగ్గర పంప్ ఆన్ చేస్తే రిజర్వాయర్లన్నీ నిండుతాయన్నారు.

అప్పుడు సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. వీటన్నింటినీ పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బద్నాం చేసే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎండుతున్న రిజర్వాయర్లు, రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. వాతావరణం అనుకూలిస్తే అన్ని బ్యారేజీలను సందర్శిస్తామన్నారు. పర్యటనలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌సింగ్, చల్ల హరిశంకర్ ఉన్నారు.

నేడు బీఆర్‌ఎస్ నేతల ప్రాజెక్టుల సందర్శన 

జయశంకర్ భూపాలపల్లి, జూలై 25(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రాజెక్టుల సంద ర్శనకు బీఆర్‌ఎస్ నేతలు శ్రీకారం చుట్టా రు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన బరాజ్‌లను సందర్శించను న్నారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగి పోగా ప్రాజెక్టు పనికి రాదంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌పై విమర్శల వాన కురిపిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద తాకిడిని తట్టుకున్న ప్రాజెక్టు పనితీరును పరిశీలించాలనే ఆలోచనతో బీఆర్‌ఎస్ నేతలు సందర్శన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సమావే శాల్లో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత గురువారం సాయంత్రం అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో బయలు దేరి మొదట కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించారు. శుక్రవారం కన్నెపల్లి పంపుహౌజ్, మేడిగడ్డ బరాజ్‌ను సందర్శిస్తారు.