02-01-2026 12:04:51 AM
దేశం ఏ ఒక్కరిదో కాదు.. అన్నీ దేశ భాషలే
ప్రజలంతా అదే భావనతో బతకండి
డెహ్రాడూన్, జనవరి 1 : దేశ ప్రజలందరూ కులం, ధనం, భాష అనే భేదాలను పక్కనపెట్టి, విభజన రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని భగవత్ పిలుపు నిచ్చారు. దేశం ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, ఇది అందరిదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల డెహ్రాడూన్‌లో త్రిపుర వి ద్యార్థి ఏంజిల్ చక్మా హత్య, జాత్యహంకార దాడి ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో ఆగ్ర హం వ్యక్తమవుతున్న సమయంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ సమగ్రతకు సామరస్యమే ప్రధానమని ఆయన పునరుద్ఘాటించారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ గ్రామంలో నిర్వహించిన హిందు సమ్మేళనంలో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరినీ మనవాళ్లుగానే చూడాలని, దేశమం తా అందరిదేనని భావించాలి. అప్పుడే నిజమైన సామరస్యం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు.
భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తేనే..
భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రజల మధ్య బంధాలను బలపరుస్తుందన్నారు. అన్ని భాషలనూ నేర్చుకోండి.. మాట్లాడండి. ఎందుకంటే.. అవి దేశంలోనే ఉన్నాయి. అవి దేశ భాషలే కాబట్టి. ఈ విషయంలో సమతూకం ఉండాల్సిందే సొంత స్థలాల్లో ఉన్న ప్పుడు.. కనీసం ఇంట్లోనైనా మీ మాతృభాష మాట్లాడండి. అప్పుడే మనుగడ ఉంటుందని సూచించారు.
అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే..
మన రాజ్యాంగంలో సమానత్వం.. వివక్ష రహిత సమాజం గురించి ప్రస్తావించారు. ‘నా హిందువులు తమ ఐక్యతను నిలబెట్టుకోవడానికి నమ్మకం, పరస్పర అవగాహన కీలకం. శ్మశానాలు వివక్ష లేకుండా అందుబాటులో ఉండాలి. ఆధ్యాత్మిక స్థలాలు (ఆల యాలు) కూడా తావులేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి. అదే ఐక్యతకు అసలైన సంకేతం. సామరస్యత అనేది ఐక్యత, సామూహిక బాధ్యతతో నడవాలి.. విభేదాలు, సంఘర్షణలతో కాదు’ అని అభిప్రాయపడ్డారు.
నిర్మాణాత్మక పరిష్కారాన్ని కనుగొనాలి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న నేరాలపై ఆత్మపరిశీలన చేసి నిర్మాణాత్మక పరిష్కారాన్ని కనుగొనాలని హిందూ సమాజానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘మనం స్థిరంగా ఉంటే సంక్షోభం మనపై ప్రభావం చూపదు. హిందూ సమాజానికి అటువంటి మేధస్సు ఉంది. హిందువులు తమలో తా ము వివక్ష చూపకూడదు‘ అని అన్నారు. సమాజంలో నమ్మకం కోల్పోవడం వల్లే మత మార్పిళ్లు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అది మార్చాలంటే ప్రజలతో గ్రామస్థాయిలో మళ్లీ అనుబంధం పెంచుకోవడం అవసరమని చెప్పారు. కొత్తగా సామా జిక బంధాలు, పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమస్యను తగ్గించవ చ్చని సూచించారు.
భగవత్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ, శివసేన నేతలు
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ భగవత్ స్పందించారు. మోహన్‌భగవత్ సరైన స్ఫూర్తితో మాట్లాడారని కొనియాడారు. సమాజాన్ని ఏకం చేస్తూ, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా అందరినీ కలుపుకుపోవడమే తమ విధానమని తెలిపారు. బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ స్పందిస్తూ.. భారత్‌లో నివసిస్తూ ’వందేమాతరం’ అనే ప్రతి ఒక్కరూ భారతీయులేనని, విశాల దృక్పథంలో హిందువులేనని అన్నారు.
మతం ఏదైనా భారత్‌ను తమ మాతృభూమిగా భావించే వారందరూ భారతీయులేనని, భగవత్ వ్యాఖ్యలు అక్షర సత్యమని పేర్కొన్నారు. శివసేన నేత షైనా ఎన్సీ కూడా భగవత్ పిలుపును స్వాగతించారు. గుడి, మంచినీటి వనరులు, శ్మశానవాటికల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎవరిపైనా వివక్ష ఉండకూడదని, అందరికీ సమాన ప్రవేశం ఉండాలని ఆమె గుర్తుచేశారు. నిజమైన సామరస్యం వివక్షను వీడటంతోనే మొదలవుతుందని భగవత్ స్పష్టం చేశారు.