11-10-2025 06:51:04 PM
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్లు పూర్తి చేసుకోవాలి..
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
కోనరావుపేట (విజయక్రాంతి): పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు గృహ ప్రవేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుపోతుందని అన్నారు. ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాము మీరు ఓట్లు అడగకుండా ఉండాలి అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో మేం చేసిన సవాలను స్వీకరించలేదని పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు సంతోషంగా తాము పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు అనీ ఆనందంతో అంటున్నారని విప్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆనాడు చేసినట్లుగా నేడూ గృహ ప్రవేశ సమయంలొ నూతన వస్త్రాలు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల జమ చేశామని అన్నారు. రైతు భరోసా క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచి 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల జమ చేశామని, రైతు బీమా కు 3 వేల కోట్ల అందించామని అన్నారు.
స్వంత ఇంటి కోసం పది సంవత్సరాలగా ఎదురు చూస్తున్న
స్వంత ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు తెలిపారు. ఈనాడు ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో నేడు ఇల్లు మంజూరు అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, జిల్లా నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.