25-07-2025 01:54:18 AM
పత్రాలను అనుసరించని దళారులు
యదేచ్చగా తరలిస్తున్న ఇసుక.
ఇసుక అక్రమ రవాణా పై అధికారుల పట్టింపేది.
అనుమతి ఒకచోట అన్ లోడింగ్ మరోచోట
వేములపల్లి, జూలై 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలించే వేసులుబాటు కల్పించింది. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకొని కొంతమంది జేబులు నింపుకుంటున్నారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలోని మూసి వాగు నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పేరిట పరిమిషన్ తీసుకొని వేరొక చోట అమ్ముకొని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమంగా తరలించి మార్కెట్లో విక్రయించి సొమ్ము కూడాబెట్టుకుంటున్నారు. ఇదంతా తెలిసినప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు పంచాయతీ కార్యదర్శి ఇల్లు మంజూరైనట్లు తహసిల్దార్ కు తెలియజేస్తారు. దీంతో తహసిల్దార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వ్యక్తికి ఇసుక కొరకు అనుమతులు ఇస్తారు. అనుమతి తీసుకున్న వారికి మాత్రమే ఇసుకను తరలించాలని నిబంధనలు ఉంటాయి.
కానీ అనుమతి ఒకచోట అన్లోడింగ్ మరొకచోట చేస్తూ దళారులు ధనార్జనే ధ్యేయంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. మండలంలోని రావులపెంట వాగు నుంచి గత కొద్ది రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా పగలు రాత్రి తేడా లేకుండా అధికారుల కనుసన్నల్లోనే సాగుతుందని స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు.
అనుమతుల పేరిట ఆదివారం కూడా జోరుగా ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రకృతి సంపదను దర్జాగా దోచుకుపోతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దయనీయంగా సామాన్యుల పరిస్థితి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకోవడంతో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. రోజురోజుకు ఇసుక ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. మూసి వాగు నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇల్లు నిర్మించుకునే క్రమంలో దగ్గరలోని వాగు నుంచి పర్మిషన్ తీసుకుంటే.. రూ . 2500 ట్రాక్టర్ ఇసుక విక్రయించాల్సి ఉంది.
కానీ అక్రమంగా రూ .500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ యజమానులు పర్మిషన్ల సాకుతో సాకుగా చూపుతూ ఇతరులకు ఒక్కొక్క ట్రాక్టర్ కు రూ.5000 వేల చొప్పున అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అదనంగా 2000 రూపాయలు రావడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను వదిలేసి బయటి వ్యక్తులకు ఇసుక విక్రయించేందుకు ట్రాక్టర్ యజమానులు మొగ్గుచూపుతున్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక అందేలా చూడాలని ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు, ప్రజలు కోరుతున్నారు.
గ్రామ కార్యదర్శుల పర్యవేక్షణ ఉండాలి
ఇంద్రమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుకను గ్రామ కార్యదర్శులు పర్యవేక్షించాలి. ఇసుక పర్మిషన్ ఇవ్వడం వరకే మా బాధ్యత లబ్ధిదారులకు ఇసుక వస్తుందా రాట్లేదా అని కార్యదర్శులు నిర్ధారించాలని తాసిల్దార్ పుష్పలత తెలిపారు.
తహసిల్దార్ పుష్పలత