21-05-2025 06:39:14 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం తేలకంటిగూడెంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లబ్ధిదారులు వర్షాకాలంలోపు గృహప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండలోని కనగల్ మండలం తేలకంటి గూడెంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జనవరి 26న కనగల్ మండలం, తేలకంటి గూడెంలోని ఇండ్లు లేని 107 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు.
ఇందులో 71 ఇండ్లు గ్రౌండ్ కాగా, ప్రస్తుతం 48 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో, రెండు రూఫ్ స్థాయిలో ఉన్నాయి. 44 ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ వరకు బిల్లుల చెల్లింపులు చేయాలన్నారు. పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ.. సంవత్సరాల నుండి గుడిసెల్లో జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.