15-08-2025 01:45:29 AM
ఇల్లందు టౌన్, ఆగస్టు14, (విజయక్రాంతి): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేస్తానని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని సుమారు ఏడులక్షల మంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై, గురువారం మొదటిసారిగా ఇల్లందుకు వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు.
తమలో ఒకరైన చావ రవి నేడు జాతీయ స్థాయిలో కార్యదర్శిగా పదవిని అలంకరించడం గర్వంగా ఉందని ఇల్లందు ఉపాధ్యాయులన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ చావ రవి గత ముప్పుఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ది కి ఎనలేని కృషి చేశారని, ప్రభుత్వ నిర్భంధా లను, కేసులను ఎదుర్కొని ధైర్యంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాడారని గత ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని రద్దుచేసి నిర్భంధా లకు గురి చేసినా రాజీలేని పోరాటం చేసి పిఆర్సీ విడుదలకు కృషి చేశారని తెలియజేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండలస్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసి నేడు అఖిలభారత ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకత్వం వహించడం జిల్లాకు గర్వకారణమని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇల్లందు మెయిన్ రోడ్ ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షులు ఏ.రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లడారు. ఈనెల ఆగష్టు 23వ తేదీన హైదరాబాద్లో జరిగే మహాధర్నా ను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమలో టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, మండల కోశాధికారి అన్నపూర్ణ, మండల కార్యదర్శులు పీ.రమేష్, జీ.కృష్ణ, జే.శ్రీను, శేషగిరిరావు, ఎన్.కిరణ్, డాక్టర్ కె.రఘు, సాంబశివరావు, కృష్ణకుమారి, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.