calender_icon.png 9 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రావొద్దు

09-07-2025 12:43:48 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, జూలై 8(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు సరిపడినం త ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇసుక లభ్యత, వివిధ నిర్మాణాలకు ఇసుక సేకరణ, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, భూ భారతి చట్టం, సిఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమగు ఇసుక అంచనా అవసరాల నివేదికలను పంపాలన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక బజార్ లను ఏర్పాటు చేసి, ఆన్ లైన్ విధానంలో విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ ఇసుక విక్రయాల విధానం అమలుతో ఇసుక సేకరణలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.

దీనికి సంబంధించి ఇసుక నిల్వ ఉంచుటకు తహసిల్దార్లు స్థలాలను గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ నిర్మాణాలలో వినియోగించే గ్రానైట్, ఇతర మెటీరియల్ సేకరణకు జీరో పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జీరో పర్మిట్ అర్హత పొందేందుకు సంబంధిత గుత్తేదార్లు తప్పనిసరిగా ఎండిఎల్ లైసెన్సు పొందాలన్నారు. ఈ విధానంలో ప్రభుత్వం అనుమతించిన క్వారీల నుంచే నిర్మాణ ముడి పదార్థాలు పొందాలని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కొరకు అవసరమగు ఇసుకను లభ్యంగా ఉంచుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలలో ప్రత్యేకించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాల కోసం అదనపు ఇసుక రీచ్ లను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించాలని అధికారులను ఆదేశించారు.

ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో ఇసుక ధరలు నియంత్రణలో ఉంచాలన్నారు. అనంతరం భూభారతి చట్టం అమలుపై తహసీల్దారులతో సమీక్షించారు. మండలాల వారిగా భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు, పూర్తి చేసిన ఆన్ లైన్ ప్రక్రియ, జారీ చేసిన నోటీసులు, పరిష్కరించిన భూ సమస్యల వివరాలను తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే భూ సమస్యల దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు.

తమ స్థాయిలో త్వరిత గతిన పరిష్కరించదగ్గ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నోటీసుల జారీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కారం ఓటిపి, ఈ కేవైసి ప్రక్రియ చేయడం కొరకు అర్జీదారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) డెలివరీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ప్పటి వరకు పూర్తిచేసిన, మిగిలి ఉన్న సిఎంఆర్ ప్రక్రియ కు సంబంధించి వివరాలను మిల్లుల వారిగా సమీక్షించారు. సిఎంఆర్ డెలివరీ వెనుకబడి ఉన్న మిల్లర్లకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని స్పష్టం చేశారు. మిల్లర్ల ఆస్తులను జప్తు చేసి, వేలం వేయాలని తెలిపారు. రేషన్ కార్డుల ఆమోదం ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

మండలాల వారిగా రేషన్ కార్డుల ఆమోదం ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల పౌర సేవల ధృవీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయకూడదని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించి, పై స్థాయికి పంపాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఏడి మైన్స్, జియాలజి రవీందర్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, భూగర్భజలాల శాఖ అధికారి శ్రీనివాస బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేంhvదర్ , మేనేజర్ సుధాకర్, తహసిల్దార్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.