30-07-2025 12:35:19 AM
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
పటాన్ చెరు, జూలై 29 : పటాన్ చెరు నియోజకవర్గంలో మరో రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా మారుస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఆరు గ్రామ పంచాయతీలతో ఇంద్రేశం మున్సిపాలిటీ, పది గ్రామపంచాయతీలతో జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది.
బచ్చు గూడెం, చిన్న కంజర్ల, పెద్దకంజర్ల, ఐనోల్, రామేశ్వరం బండ, ఇంద్రేశం గ్రామాలతో ఇంద్రేశం మున్సిపాలిటీ ఏర్పాటు కానుండగా జిన్నారం, మంగంపేట, జంగంపేట, ఊట్ల, సోలక్ పల్లి, అండూర్, శివనగర్, రాళ్లకత్వ , కొడకంచి, నల్తూరు గ్రామాలతో జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పడనుంది. పటాన్ చెరు నియోజకవర్గంలో సుమారు గత ఐదు సంవత్సరాల కిందట తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.
దాదాపు ఎనిమిది నెలల క్రితం జిన్నారం మండలంలో గడ్డపోతారం, పటాన్ చెరు మండలంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలుగా ఒకే సారి ఏర్పడ్డాయి. జిన్నారం మండలంలో బొల్లారం, గడ్డపోతారం ఇదివరకే మున్సిపాలిటీలుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా జిన్నారం పది గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీగా ఏర్పడడంతో జిన్నారం మండలంలో పంచాయతీ రాజ్ పాలన ఇక ముగిసినట్లే.
కాగా జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటుపై పది గ్రామ పంచాయతీ ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఉన్న ఊర్లను మున్సిపాలిటీగా మార్చడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉండదని దీంతో ఉపాది తగ్గుతుందని, పన్నుల భారం భారీగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.