03-08-2025 11:20:21 PM
రెండు గంటల పాటు గర్భిణీ నరకయాతన
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతూ అంబులెన్స్ ని ఆశ్రయించిన బాధితురాలికి చేదు అనుభవం ఎదురయింది. ఆసుపత్రికి చేర్చాల్సిన సిబ్బంది సుమారు రెండు గంటల పాటు అంబులెన్స్ లోనే గర్భిణీ నరకయాతన అనుభవిస్తున్నా డ్యూటీ మారడం కోసం నిర్లక్ష్యం వహిస్తూ ఆసుపత్రికి ఆలస్యంగా చేర్చడంతో పసికందు మృత్యువాత పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చిన్న కార్పాముల గ్రామానికి చెందిన మనీషా మొదటి కాన్పు కోసం పురిటి నొప్పులతో బాధపడుతూ 108 అంబులెన్స్ ఆశ్రయించింది.
అంబులెన్స్ లోకి ఎక్కించుకున్న సిబ్బంది తన డ్యూటీ మారాల్సి ఉందని సాకు చూపి మండల కేంద్రంలోని సుమారు రెండు గంటల పాటు అక్కడే నిలిపి ఉంచాడు. ఆస్పత్రికైన చేర్చాలని ప్రాదయపడడంతో అక్కడే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కానీ అక్కడి స్టాఫ్ నర్స్ పరిస్థితి విషమంగా ఉందని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. షిఫ్ట్ మారిన అనంతరం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి డెలివరీ చేశారు ఆ క్రమంలో పసిబిడ్డ మృతి చెందింది. అంబులెన్స్ లోనే సుమారు రెండు గంటల పాటు ఆలస్యం చేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త నరసింహ బంధువులు డిమాండ్ చేశారు.