14-10-2025 12:42:46 AM
నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి
హుస్నాబాద్, అక్టోబర్ 13 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతి కేసులో నెలకొన్న ఉత్కంఠ, అనుమానాలు ఇంకా వీడలేదు.
ఈ క్రమంలో ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాఠశాలను సందర్శించారు. అయితే ఆయన విచారణ పద్ధతి, విచారణ బాధ్యతలు అప్పగించిన అధికారిపై వ్యక్తమవుతున్న తీవ్ర విమర్శలు ఈ కేసును మరింత వివాదాస్పదం చేస్తున్నాయి.
అన్ని కోణాల్లో చైర్మన్ విచారణ
విద్యార్థి మృతిని ’హత్యా, ఆత్మహత్యా’ అనే మిస్టరీకి తెరదించేందుకు పాఠశాలకు చేరుకున్న బక్కి వెంకటయ్య, మొదటగా ఘటన జరిగిన క్లాస్ రూమ్ కారిడార్ను, నైలాన్ దారం కట్టి ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శామలతను గట్టిగా ప్రశ్నించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి వాంగ్మూలాలు సేకరించారు.
అత్యంత పర్యవేక్షణలో ఉండాల్సిన గురుకులంలో విద్యార్థి నిర్జీవంగా పడి ఉన్నాడని, అయితే ’కింద పడ్డాడు’ అని మాత్రమే తమకు ఉపాధ్యాయులు చెప్పారన్న వివేక్ తండ్రి ఆరోపణలపైనా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. గురుకుల ప్రాంగణంలో భద్రతా లోపాలను, సీసీ కెమెరాల పరిస్థితిని కూడా ఆయన పరిశీలించారు.
విచారణ కమిటీ ఏర్పాటు.. కానీ?
పర్యటన ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, వివేక్ మృతి ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి, బాధ్యులను గుర్తించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ’ఎంతటి వారినైనా’ వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ ఆరోపణలు, తీవ్ర అభ్యంతరాలు
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్కు విచారణ బాధ్యతలు అప్పగించడంపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈడీ విజయభార్గవ్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికి అల్లుడు కావడంతో, ఈ విచారణ ’రాజకీయ’ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఈడీని ప్రభావితం చేసి, కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, తద్వారా విద్యార్థి మృతికి గల అసలు కారణాలు దాచిపెట్టబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘స్థానిక రాజకీయ పలుకుబడి ఉన్న అధికారికి కాకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించే మరొక సీనియర్ అధికారికి ఈ విచా రణ బాధ్యతను అప్పగించాలి‘ అని మృతుడి కుటుంబ సభ్యులు కమిషన్ చైర్మన్ను డిమాండ్ చేశారు.
విద్యార్థి మృతిపై ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరోవైపు విచారణ కమిటీ నియామకం, దానిపై వ్యక్తమవుతున్న రాజకీయ విమర్శలతో ఈ కేసులో కొత్త ఉత్కంఠ నెలకొంది. కమిటీ నిష్పక్షపాతంగా పనిచేసి, పాఠశాల అధికారుల నిర్లక్ష్యం, తోటి విద్యార్థుల పాత్ర ఏదైనా ఉంటే బయటపెడుతుందా? అనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.