27-08-2025 01:34:40 AM
నంగునూరు బీజేపీ నాయకులు ఆరోపణ
నంగునూరు, ఆగస్టు 26: నంగునూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భారీ అవినీతి జరుగుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం నంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు చౌడిచెర్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలకు కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు.
ప్రభుత్వ అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్ల మంజూరులో అధికారులు, నాయకులు లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది అవినీతికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. పేదలకు అన్యాయం జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం చేపట్టి ఇన్ని రోజులు గడిచినా ఒక్క హామీని నెరవేర్చలేదని, కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ఇప్పటికీ అమలులోకి రాలేదని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో కూడా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకట్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రజనీకర్ రెడ్డి, సతీష్, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.