13-01-2026 12:00:00 AM
నాడు 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించాం
నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య
చిట్యాల, జనవరి 12 (విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించామని, కానీ నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేడు ఈ నిర్మాణ పనులను నిలిపివేసిందని అన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్కరోజైనా పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించలేదంటే ఆయనకు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆలోచన ఉందో పురవాసులు ఆలోచన చేయాలని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డు కాంప్లెక్స్ నిర్మాణానికి దాదాపు కోటిన్నర నిధులు మంజూరు చేసి, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తిచేశామని, తాము పూర్తి చేసిన కాంప్లెక్స్ శిలాఫలాకాన్ని తొలగించి కొత్త శిలాఫలకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత రెండేళ్లలో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తూ, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేసి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్, పొన్నాల లక్ష్మయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.