15-08-2025 01:51:53 AM
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 14 (విజయక్రాంతి): కొత్తగూడెం ప్రగతి మైదానంలో నేడు జరగనున్న 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుండి కార్యక్రమం ముగిసే వరకు జరిగే అన్ని ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని ఇస్తారు.
ఈ కార్యక్రమంలో మార్చ్ పాస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేదిక బ్యాక్డ్రాప్, పోలీసు సాయుధ దళాల మార్చ్ పాస్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానం వంటి కార్యక్రమాల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, డి.ఆర్.డి.ఏ., డ్వామా, వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, తదితర శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు, అధికారులకు మరియు విఐపీలకు గ్యాలరీలు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి సదుపాయాలు పకడ్బందీగా ఉండాలని, వర్షం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.