calender_icon.png 29 May, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్సులిన్ సప్లె.. ఎందుకింత నిర్లక్ష్యం?

28-05-2025 12:52:10 AM

- ఎల్1 సప్లయర్ లేకుంటే ఎల్2, ఎల్3 ఏమయ్యారు..?

- ఫైనాన్సియల్ కోడ్ రూల్స్ పట్టించుకోని టీజీఎంస్‌ఐడీసీ

- తాత్కాలిక సప్లు అవకాశాలను కాదని టెండర్ల పేరిట ఆలస్యం

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఇన్సులిన్ లేక రాష్ట్రంలో షుగర్ పేషెంట్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్‌ఐడీసీ) వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఇన్సులిన్ సప్లు ఆగిపోయిందని ఓవైపు అంగీకరిస్తూ టీజీఎంఎస్‌ఐడీసీ ఇచ్చిన వివరణ విస్తుగొలిపేలా ఉందని వైద్యులు, ఫార్మారంగ నిపుణు లు, మెడిసిన్ సప్లయర్స్, మేధావులు మండిపడుతున్నారు. కనీసం ఫైనాన్సియల్ కోడ్ రూల్స్ కూడా పాటించకుండా కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరించడం ఆశ్చర్యపరుస్తోందంటున్నారు.

ఇన్సులిన్ సప్లు ఆగిపోయి న మాట వాస్తవమేనంటూ పీహెచ్‌సీ స్థాయి లో ఇన్సులిన్ (30:70 ప్రీమిక్స్‌డ్ హ్యూమన్ ఇన్సులిన్) సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మ రో రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో పెట్టినందున సద రు సప్లయర్ అనర్హతకు గురయ్యారని టీజీఎంస్‌ఐడీసీ పేర్కొనడం చూస్తే వారు నిబం ధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోందని ఫార్మారంగ నిపుణులు అంటున్నారు.

ఈనెల 26న ‘ఇన్సులిన్ నో స్టాక్’ విజయక్రాంతిలో ప్రచురిత మైన కథనంపై వివరణ ఇస్తూ ఇన్సులిన్ సప్లు చేసే సప్లయర్‌ను మరో రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో పెట్టినందుకే  సప్లు ఆపేసి తాజాగా టెండర్లను ఆహ్వానించినట్లు, అది సాంకేతిక అంశాల అంచనా వేసే దశలో ఉన్నట్లు కార్పొరేషన్ పేర్కొనడం ఆశ్చర్యపరుస్తోందని హైదరాబాద్‌కు చెందిన ఓ మెడిసిన్ సప్లయర్ తెలిపారు.

తమ వద్ద ఉన్న ఇతర ఇన్సులిన్ స్టాక్స్ ర్యాపిడ్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ మొదలైన వాటిని రోగులకు అందుబాటులో పెట్టామని చెప్పడం కూడా సరికాదని వైద్యనిపుణులు అంటున్నారు. వేరే కాంబినేషన్స్ ఇస్తే రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

బ్లాక్‌లిస్టులో పెడితే కనీసం 3 నెలలు..

ఓ సప్లయర్‌ను బ్లాక్‌లిస్టులో పెడితే కొత్త గా మరో సప్లయర్ కోసం టెండర్ వేయాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుం దని ఫార్మారంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. టెండర్ నిబంధనల మేరకు 30 రోజుల సమయం పోగా, టెక్నికల్ ఎవాల్యుయేషన్, ఫైనాన్సియల్ ఎవాల్యుయేషన్ కోసం కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. గరిష్ఠంగా ఇందుకు 3 నెలల సమ యం కావాల్సి ఉంటుందన్నారు.

అధికారులు ప్రజలకు వేగంగా మందులు అందిం చాలని తాపత్రయపడినా కనీసం ఇందుకు 2 నెలల సమయం తప్పనిసరి అని తెలుస్తోంది. కానీ 15రోజుల్లో సాంకేతిక అంశాల న్నీ పూర్తిచేసి టెండర్లు పిలించేందుకు ప్రయత్నిస్తున్నామని కార్పొరేషన్ ప్రకటిం చింది. అయితే రాష్ట్రంలోని ప్ర భుత్వ హాస్పిటల్స్‌లో ఇన్సులిన్ లేక రోగులు ఇబ్బందు లు పడుతున్న అంశంపై వెంటనే స్పందించి స్టాక్స్ ఉండేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించినా..టీజీఎంఎస్‌ఐడీసీ తీరులో మార్పు రాలేదని వైద్యులు పేర్కొంటున్నారు.

ఎల్2, ఎల్ 3 ఏమయ్యారు..

ఎల్1 సప్లయర్ బ్లాక్‌లిస్టు అయ్యాడని తెలిసి ఆర్డర్ పెట్టలేదని చెప్తున్న కార్పొరేషన్..ఎల్1 లేకుంటే ఎల్ 2, ఎల్3 ద్వారా తాత్కాలిక ధరలతో కొత్త టెండర్లు ఖరారు అయ్యే వరకు సప్లు చేయించే అవకాశం ఉంటుంది. ఫైనాన్సియల్ కోడ్ రూల్స్ ప్రకారం వారి ద్వారా ఇన్సులిన్ ప్రొక్యూర్ చేయవచ్చు.

ఎల్ 1 ధరలతో ఎల్2 ధరలకు వేరియేషన్ ఉంటే బ్లాక్ లిస్ట్ బారిన పడి సప్లు చేయడం ఫెయిల్ అయిన ఎల్ 1 బిల్లులు లేదా ఈఎండీ ద్వారా రికవరీ చేసి మిగతా పేమెంట్స్ సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్సియల్ కోడ్ రూల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి.

కానీ అవన్నీ వదిలేసి బ్లాక్‌లిస్ట్ అయ్యాడని వివరణ ఇచ్చి చేతులు దులుపుకునేందుకు టీజీఎంస్‌ఐడీసీ ప్రయత్నించిందని సులభంగా అర్థమవుతోంది. అసలు ఎల్1 సప్లయర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిందని చెప్తున్నా ఆ వేరే రాష్ట్రం ఏదో ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిందో కూడా అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు. 

పేమెంట్స్ చేయనందుకే సప్లు ఆగిందా..

ఎల్ 1 సప్లయర్ బ్లాక్‌లిస్ట్ చేశారు కాబట్టే సప్లు ఆగిందని టీజీఎంస్‌ఐడీసీ చెప్తున్నా దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎంస్‌ఐడీసీ నుంచి మెడిసిన్ సప్లయర్స్‌కు బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నందునే సప్లయర్స్ మెడిసిన్ సప్లు చేయడం లేదని తెలుస్తోంది.

పేమెంట్స్ చేయని నేపథ్యంలోనే సప్లయర్ సప్లు ఆపేశారని..అది చెప్పలేకే అధికారులు సప్లయర్‌ను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు పేర్కొంటూ ఈ వ్యవహారాన్ని ముగించే ప్రయత్నం చేసినట్లుగా ఈ రంగానికి చెందిన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీజీఎంస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌటిల్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.