03-01-2026 09:02:35 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలో నూతనంగా ఎన్నికైన 27 గ్రామ పంచాయతీ సర్పంచులతో మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిఎల్పిఓ సురేందర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్ల అధ్యక్షతన శనివారం పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు పాల్గొని వారి శాఖపరమైన వివిధ అంశాలను వివరించారు.ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ... గ్రామ పాలనలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామానికి ప్రథమ పౌరులుగా సర్పంచులు బాధ్యతయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలలో అధికారులు ముందుగా సాంప్రదించే వ్యక్తి సర్పంచినేనని తెలిపారు.గ్రామ పంచాయతీలో జరుగుతున్న పరిపాలన విధానాలు, అంగన్వాడి కేంద్రాలు, వీధి దీపాలు, మురికి కాలువలు, పచ్చదనం పరిశుభ్రత, గ్రామపంచాయతీ స్థలాల వివరాలు తదితరాంశాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వము అందిస్తున్న నిధులు మూడు రకాలుగా ఉంటాయని డిఎల్పిఓ సురేందర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు, గ్రామపంచాయతీ పన్నుల రూపంలో వచ్చే నిధులను గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలన్నారు.
రెండు నెలలకు ఒకసారి గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రతిదీ తీర్మానం చేయాలని, గ్రామసభలు ఏర్పాటు చేయకపోతే సర్పంచి పదవికే ఏస్తారు వస్తుందన్నారు. ప్రతి రూపాయి గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేలా ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలని, పారదర్శకతతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేయాలని సర్పంచులకు సూచించారు. కార్యదర్శులు సర్పంచులు ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా కలిసి పనిచేయాలన్నారు. ప్రతి పని తీర్మానం చేసి రికార్డులో పొందుపరచాలన్నారు.