28-05-2025 01:48:49 AM
బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు
నమ్మకంతో పూచీకత్తు తీసుకోని వ్యక్తులు
వ్యాపారి అదృశ్యంతో ఆందోళన
నిజామాబాద్, మే 27 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో దశాబ్దాలుగా ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.81 కోట్లు తీసుకుని ఐపీ పెట్టి అదృశ్యమయ్యాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాల్ద గ్రామంలో దశాబ్దాలుగా పరిశ్రమను నడుపుతున్న ఓ ప్లాస్టిక్ బ్యాక్స్ వ్యాపారి.. తన వ్యాపార నిమిత్తం పలు బ్యాంకులు, ప్రవేట్ సంస్థలతోపాటు బంధువులు, ఇతర వ్యాపారుల వద్ద రూ.81 కోట్లు అప్పు చేశాడు.
పరిశ్రమ పెద్దదిగా ఉండి, దశాబ్దాలుగా వ్యాపారం నిర్వహిస్తుండటంతో సదరు వ్యాపారిని నమ్మి వడ్డీ ఆశతో అప్పులు ఇచ్చారు. తీరా సదరు వ్యాపారి ఐపీ పెట్టడంతో పూచీకత్తు లేకుండా అప్పు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు లబోదిబోమంటున్నారు.
స్థానిక గంజిలో కమిషన్ ఏజెంట్ల దుకాణదారులు సైతం పెద్ద మొత్తంలో సదరు వ్యాపారికి అప్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు అప్పుకు పూచీకత్తు పెట్టిన వ్యాపారి ప్రైవేటు వ్యక్తుల ద్వారా తీసుకున్న అప్పుకు ఎలాంటి పూచీకత్తు పెట్టకుండా తీసుకున్నాడు. కొందరు వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.