24-01-2026 12:27:12 AM
మహబూబాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): మహాబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం పంచాయితీ పరిధిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం మొక్కజొన్నలు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే అమాయక గిరిజన రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మర్రిగూడెం గ్రామానికి చెందిన రైతులు సువర్ణపాక కిరణ్మయి, సువర్ణపాక వనిత, సువర్ణపాక లక్ష్మీనరసు, మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన కుంజా నరసయ్య, మేడ కిరణ్, మేడ సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తాకు 50 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం చేయవలసి ఉండగా, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మాత్రం 51 కిలోల 700 గ్రాముల నుంచి 52 కిలోల వరకు తూకం వేస్తున్నారని ఆరోపించారు.
ఈ విధంగా అదనంగా వచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రం నిర్వాహకుల కుటుంబ సభ్యుల పేర్లపై, బినామీల ఖాతాల్లో నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రైతులు తాము విక్రయించిన పంటకు సంబంధించిన పూర్తి డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ కావడం లేదని, కొంతమంది రైతులకు సగం డబ్బులు మాత్రమే జమ అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు తక్కువగా పడిన విషయాన్ని ప్రశ్నిస్తే, సెంటర్ నిర్వాహకులు తమ వ్యక్తిగత ఫోన్పే ఖాతాల ద్వారా కొంత మొత్తాన్ని పంపించి విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో గన్నీ బస్తాలు సరఫరా చేయాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం గన్నీ బస్తాలు, సుతిలి దారం సహా అన్ని ఖర్చులు రైతులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
దీంతో పంట అమ్మకానికి వచ్చిన రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటున్నారు. మద్దతు ధర వస్తుందనే నమ్మకంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన గిరిజన రైతులు, ఇలాంటి మోసాలతో తీవ్రంగా నష్టపోయామని, ఈ తరహా వ్యవహారాలు కొనసాగితే ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
విచారణ జరుపుతున్నాం మొక్కజొన్న కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టాము. కొన్ని కొనుగోల్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించి రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం పొగళ్లపల్లి సొసైటీ ఇంచార్జ్ సీఈవో, వెంకన్న.