27-09-2025 01:24:35 AM
కలెక్టరేట్ ఎదుట పంచాయితీ కార్మికుల ధర్నా
మహబూబాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పంచాయితీ కార్మికులను పండగ పూట పస్తులు ఉంచడమే ప్రజా పాలనా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపేందర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండి మొయినుద్దీన్, బండ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల ఎంతో సంతోషంగా కుటుంబాలతో గడపాల్సిన పండుగల పూట కూడా వేతనాలు లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలనంటే పస్తులు ఉంచడమేనా అని ప్రశ్నించారు.
తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, దసరాకు రెండు జతల బట్టలు, సబ్బులు, నూనెలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఎల్ పిఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మారపు సుధాకర్, వివిధ మండలాల నాయకులు లతీఫ్, అశోక్, ఉపేంద్రాచారి, లచ్చయ్య ప్రసాద్, నవీన్, గణేష్, రామకృష్ణ, బాబు, సైదులు, రాములు, యాకలక్ష్మీ, ఉమ, రాధ తదితరులు పాల్గొన్నారు.