26-10-2025 12:00:00 AM
కాలం మారింది. పిల్లల పెంపకమనేది ఇప్పటి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతున్నది. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే నిరంతరం కష్టపడుతుంటారు. తాము సాధించలేనిది తమ పిల్లల్లో చూడాలనే తాపత్రయంతో ఉంటారు. అందుకోసం తమ జీవితాన్ని, ఇష్టా ఇష్టాలను ధారపోసి పిల్లల బాగు కోసం శ్రమిస్తుంటారు. కానీ ఇప్పటి పిల్లల్లో తల్లిదండ్రుల మాట వినని వారే సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
మాములుగా చదువుకునే సమయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి, శ్రమ ఉండదు. ఆట, పాట.. ఇలా నచ్చింది ఏదైనా చేసుకునే సౌలభ్యం పిల్లలకు కేవలం ఈ వయసులో మాత్రమే ఉంటుంది. తమ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
ఈ ధోరణి పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినా క్రమశిక్షణలో పెట్టడానికే అన్నట్లుగా ఉండేది. అయితే నేడు పేరెంటింగ్‌లోనూ క్రమంగా మార్పులు వస్తు న్నాయి. పెరుగుతున్న ఖర్చులు, అదనపు ఆదాయ వనరుల కోసం తల్లిదండ్రులిద్దరూ శ్రమించాల్సి వస్తున్నది. ఉదయం వెళ్లి సాయంత్రం ఇల్లు చేరే దంపతులు పని ఒత్తిడి దృశ్యా పిల్లల పెంపకంపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు.
పిల్లలు సరిగ్గా స్కూళ్లకు, కాలేజీలకు వెళుతున్నారా, చదువు ఎలా సాగుతుంది, మార్కులు ఎలా వస్తున్నాయి అనే విషయాలపై శ్రద్ధ చూపకపోవడం, వారితో ప్రేమగా మాట్లాడేందుకు సమయం కేటాయించకపోవ డం వల్ల పిల్లలు ఒంటరితనానికి లోనవుతున్నారు. దీనికి తోడు టెక్నాలజీ పుణ్యమా అని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అడల్ట్ కంటెంట్‌ను చూస్తూ చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల ఇంట్లో పెద్దల మాటకు ఎదురు చెప్పడాలు, అన్నీ మాకే తెలుసు అన్న ధోరణి కూడా పిల్లల్లో బాగా పెరిగిపోతుంది. పాతతరం పెంపకానికి వ్యతిరేకంగా ఉంటున్న కొందరు తల్లిదం డ్రులు ఇప్పటి ‘జనరేషన్ జెడ్’ పిల్లలను అతి గారాభంగా పెంచుతున్నారు.
వాళ్లు ఏమీ అడిగితే అది కొనిస్తూ, ఇవ్వాల్సిన దాని కంటే అధిక స్వేచ్ఛను ఇస్తూ వారు చెడిపోవడానికి ప్రధాన కారణమవుతున్నారు. చదువుల్లో మం చి మార్కులు రావాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి, వారి భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు తమ పిల్లలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. అందుకోసం లక్షలు ఖర్చు చేసి మరీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తల్లిదండ్రులు అంచనాలు పెట్టుకోవడం మంచిదే కానీ బలవంతంగా వాటి ని పిల్లలపై రుద్దడం సరికాదు.
ఆ లక్ష్యాలను వాళ్లు సాధిస్తే సరి, అలా కాదని చదువులో ఏ మాత్రం వెనుకబడినా ‘నీకు ఏం చేతకాదు’ అని తమ మాటలతో చిన్నబుచ్చుతున్నారు. అంతేగాక నలుగురిలో వారిని అవహేళన చేస్తూ మాట్లాడడం వల్ల పిల్లలు మరింత మొండిగా తయారవుతున్నారు. తమ మొండితనంతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
ఉన్నత చదువులు చదవి కూడా ఉద్యోగాలు పొందడంలో విఫలమవుతూ వారు బాధప డుతూ, తల్లిదండ్రులను కూడా బాధపడేలా చేస్తున్నారు. ఉన్నత లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్న కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతుంటే, మరికొందరు మాత్రం బలవంతపు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.