26-10-2025 12:00:00 AM
నేడు గృహహింస చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా
దశాబ్దాలు మారినా ఎక్కడో ఒక చోట ఇప్పటికీ మహిళలు హింస పడుతూనే ఉన్నారు. భర్త కోపం, అత్తమామల వేధింపులు, ఆడపడుచుల అవ మానాలు, ఆర్థికస్వేచ్ఛ లేనితనం, మాటల గాయాలు, ఇష్టాలతో సంబంధం లేకుండా పురుషాధిక్యతలో తన జీవితాన్ని కష్టాల ఊబిలోనే నెట్టుకొస్తుంది. ఈ పరిస్థితుల్లో మహిళా గౌరవానికి మహిళా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు గృహ హింసను నేరంగా గుర్తించి, రక్షణ కల్పించాలనే దశాబ్దాల పోరాట ఫలితమే నేడు గృహహింస చట్టంగా మారింది.
2005లో చట్టంగా రూపొంది, మరుసటి ఏడాది అక్టోబర్ 26న జాతీయ గృహహింస చట్టంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కేవలం భర్త చేతిలో హింసకు గురైన మహిళలకే కాదు సోదరుడు, తండ్రి, ఎవరైనా కుటుంబ సభ్యుల చేత మానసిక, శారీరక, లైంగిక, ఆర్థిక, మాటల దౌర్జన్యానికి గురైన మహిళలకు రక్షణగా నిలుస్తుంది. అయితే చట్టం అమల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతు న్నా, గృహహింస కేసులు తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళ గృహహింస బాధితురాలవుతోంది. అయితే ఇక్కడ చట్టం బలహీనం కాదు, సమాజంలో మనస్తత్వం ఇంకా మారలేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు చట్టం గురించి తెలి యక తమలో తామే కుమిలిపోతూ కుటుంబ గౌరవం పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు.
మరోవైపు పట్టణాల్లో, చదువుకున్న వర్గాల్లో మహిళలు తమ హక్కులను తెలుసుకొని పోరాటాలు చేస్తున్నారు. మహిళా కమిషన్లు, లీగల్ ఎయిడ్ సెంటర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు, సోషల్ మీడి యా ప్రచారాలన్నీ మహిళల్లో కొత్త ధైర్యాన్ని నింపుతున్నాయి. గృహహింస గురించి మాట్లాడటమనేది ఇప్పుడు చైతన్యంగా మారింది. ఒకప్పుడు ‘భర్తను జైల్లో పెడతావా?’ అని తిట్టినవారు ఇప్పుడు నిన్ను ఎవరు బాధించడానికి హక్కు ఇచ్చారు?’ అని ప్రశ్నిస్తున్నారు.
గృహహింసను అరికట్టడంలో కేవలం చట్టాలు మాత్రం సరిపోవు మనుష్యుల మనసులు కూడా మారాలి. పిల్లలకు చిన్నతనం నుంచే లింగ సమానత్వం నేర్పాలి. ఫిర్యాదు చేసిన మహిళను దోషి లా సమాజం, కుటుంబం చూడకూడదు. ప్రభుత్వాలు గృహహింస చట్టం అమలును కేవలం పత్రికల్లో కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి. మహిళల కోసం ప్రత్యేక న్యాయ సహాయం, కౌన్సెలింగ్ కేంద్రాలు, రక్షణ గృహాలు మరింతగా పెంచాలి.
మీడియా కూడా గృహ హింసను వినోద అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూపాలి. కేసులను అరవై రోజుల్లో విచారించి తీర్పు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది. కావున త్వరగా విచారణ జరిపి దోషులను శిక్షిస్తే సమాజం మేలుకుంటుంది. గృహహింస రహిత సమాజాన్ని నిర్మించాలంటే చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి.
మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, న్యాయవ్యవస్థ, న్యాయ సేవల అథారిటీల మధ్య సమర్థవంతమైన సమన్వ యం ఉండాలి. గృహహింస నిరోధక చట్టమనేది మహిళలకు గౌరవం, రక్షణ, స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఒక సామాజిక ఒప్పందం. చట్టం ద్వారా సాధించిన పురోగతిని పటిష్టం చేసుకుంటూ, అన్ని వర్గాల మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడానికి కలిసికట్టుగా కృషి చేయాలి.
సుచిత్ర మొగిలి, 8466827166