03-08-2025 12:00:00 AM
దక్షిణాదిలో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయి న్లలో అనుష్క శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్నాళ్లుగా సినిమాలు తగ్గుపోయాయి. అరుంధతి, బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్ల చిత్రాల్లో తన నటనా ప్రతిభను చాటుకున్న స్వీటీ.. బాహుబలి తర్వాత వెండితెరపై కనిపించింది అంతంత మాత్రమే. ఇందుకు గల కారణాలు ఏవైనా.. పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసిన దాఖలాలు లేవు.
దీంతో అనుష్క సినీ కెరీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వార్త కూడా వినవస్తోంది. ఆమె ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వాలని భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె బెంగళూరుకు మకాం మార్చారని అంటున్నారు. అక్కడ యోగా టీచర్‌గా గడపాలనుకుంటోందట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి.
కచ్చితమైన రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడటం లేదు. ఇది అనుష్క కెరీర్‌లో కీలక ప్రాజెక్ట్‌గా చెప్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో గంజాయి తోటల కథతో రూపొందింది. ఈ సినిమా ఆమె సినీ కెరీర్‌ను డిసైడ్ చేస్తుందని.. హిట్ అయితే మళ్లీ అనుష్క ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.