calender_icon.png 21 August, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరంలో కొనసాగిన ఐటీదాడులు

21-08-2025 12:00:00 AM

- మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లో రెండోరోజూ సోదాలు

- డీఎస్‌ఆర్ గ్రూప్‌తో లావాదేవీలపై ఐటీ అధికారుల నజర్

- భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం 

- నేడు తెరుచుకోనున్న బ్యాంక్ లాకర్లు!

- ఏపీ లిక్కర్ స్కాం లింకులతో మరో సంస్థపైనా దాడులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎస్‌ఆర్ గ్రూప్‌తో పాటు, ఆ సంస్థతో ఆర్థిక లావాదేవీలు జరిపిన చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు రెండోరోజూ కొనసాగాయి. మంగళవారం తెల్లవా రుజామున ప్రారంభమైన తనిఖీలు బుధవారం కూడా నిర్విరామంగా సాగాయి.

డీఎస్‌ఆర్ గ్రూప్ చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో జరిగిన నగదు లావాదేవీలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో రంజిత్‌రెడ్డికి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో, ఆయన నివాసంలో ఐటీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.

డీఎస్‌ఆర్ గ్రూప్‌లోని డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ వంటి పలు అనుబంధ సంస్థలతో రంజిత్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆధా రాలు సేకరిస్తున్నట్టుతెలుస్తోంది. ఈ సోదా ల్లో భాగంగా అధికారులు పెద్దమొత్తంలో నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

సోదాల్లో భాగం గా డీఎస్‌ఆర్ కంపెనీ అధినేతలకు సంబంధించిన పలు బ్యాంకు లాకర్లను ఐటీ అధికా రులు గుర్తించారు. వాటిని గురువారం తెరవనున్నట్టు తెలుస్తోంది. ఈ లాకర్లు తెరిస్తే మరిన్ని కీలక పత్రాలు, నగదు, బంగారం బయటపడే అవకాశం ఉందని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్ లింకులపైనా ఆరా

మరోవైపు, ఏపీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వరుస ఐటీ దాడులతో నగరంలోని పలు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.