01-01-2026 12:00:00 AM
కిరణ్ హీరోగా, అక్సాఖాన్, అలేఖ్యరెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మాణ దర్శక త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్, సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్ర మంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ అభిమానిగా ఆయన సినిమా పేరుతో మరో చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నా” అన్నారు. ‘డాన్సర్‌గా, నటిగా నన్ను మరింత ప్రోత్సహిస్తారని ప్రేక్షకులను ప్రార్థిస్తున్నాన’ని హీరోయిన్ అక్సాఖాన్ అన్నారు.
దిల్ రాజు పరిస్థితీ దారుణం: ‘మన ప్యానెల్’ సభ్యులు
ఇక ఇదే వేదికపై టీఎఫ్‌సీసీ ఎన్నికల్లో ప్రభావం చూపిన ‘మన ప్యానెల్’ సభ్యులు మాట్లాడారు. “చిన్న సినిమా పరిశ్రమకు అవసరం, ప్రోత్సహిద్దాం. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల బరిలో ‘మన ప్యానెల్’ తరఫున మూడు సెక్టార్స్‌లో నిల్చున్నాం. అవతలి ప్యానెల్ వారికి చిన్న నిర్మాతల సపోర్ట్ లభించింది. అది వారు గుర్తు పెట్టుకోవాలి. గతంలో రామానాయుడు, కేఎస్ రామారావు, అశ్వనీదత్ వంటి గొప్ప నిర్మాతలు కొత్తవారిని ప్రోత్సహిచారు.
ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకే వ్యక్తి చేతిలో ఉంది.. ఎఫ్‌డీసీ చైర్మన్ హోదాలో ఉన్న నిర్మాత దిల్ రాజు కూడా సినిమాలు తీయలేని పరిస్థితి ఉంది. చిన్న సినిమాలు రిలీజ్ వరకూ వచ్చి ఎందుకు ఆగుతున్నాయి? హీరోలు కూడా గాలిలో నడిచే నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుండేలా చూద్దాం. ఒక్కడినే ఇండస్ట్రీని ఏలుదామనుకోవడం సరికాదు” అన్నారు.