calender_icon.png 10 August, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే

09-08-2025 05:13:44 PM

ఆపరేషన్ కగర్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున దాడులు, హత్యలు ఆపాలి..

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..

పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేని కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI State Secretary Kunamneni Sambasiva Rao) అన్నారు. శనివారం మండల పరిధిలోని పాత సూరారం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, అమాయక ఆదివాసీలపై నిర్భందాలకు స్వస్తి చెప్పాలిని, అడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఆదివాసులే అడవులు, ప్రకృతి ప్రేమికులని, అడవులను రక్షించే వారు కూడా ఆదివాసులే అని అన్నారు. ఆదివాసులకు ఒక ప్రత్యేక జీవన విధానం, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉంటారు. 

ఈ ప్రపంచానికి మూల వాసులు ఆదివాసులే అన్నారు. గోండు కుటుంబంలో జన్మించిన కొమరంభీం తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాటాలు నిర్వహించిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి, అడవి, నీరు మాదే) అనే నినాదంతో అడవి బిడ్డలను ఏకం చేశాడని తెలిపారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పాత సూరారం గ్రామంలో ఆదివాసీ కుటుంబాలందరూ ఎంతో ఆరాధనతో, ప్రేమతో కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు కొమరం భీమ్ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభ దశల్లో ఉన్నప్పుడు తన ఆలోచనా విధానంతో, పోరాట విధానంతో కమ్యూనిస్టులను కూడా ప్రభావితం చేశారని పేర్కొన్నారు.

1940లో ఆనాటి పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన మరణించి నప్పటికీ, ఆయన నినాదం ఆగలేదన్నారు. కొమరం భీమ్ ఆశయ సాధన కోసం, మంచి, న్యాయం కోసం ప్రాణాలు అర్పించాడని, ఆ న్యాయ మార్గాన్ని వదలకుండా అందరికీ సమ న్యాయం కోసం పోరాటాలు కొనసాగిస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, మండల అధ్యక్షుడు కొండా వెంకన్న, సీపీఐ జిల్లా సమితి సభ్యులు డి సుధాకర్, నిమ్మల రాంబాబు, అన్నారపు వెంకటేశ్వర్లు పెద్దమ్మ గుడి డైరెక్టర్లు శనగారపు శ్రీనివాసరావు, చెరుకూరి శేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.