calender_icon.png 27 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి మినీ మేడారానికి వేళాయే..

27-01-2026 12:17:10 AM

రేపే జాతర ప్రారంభం... ఇంకా పూర్తి కానీ పనులు..

రేగొండ,జనవరి 26(విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో గల శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి కొండల మధ్య కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు వేళాయింది.ఎన్నో యేండ్ల చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.దీంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి రాగా జాతర వైభవంగా సాగుతుంది.

బుధవారం సాయంత్రం సారలమ్మ,గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దె లను చేరుకోగా గురువారం సాయంత్రం సమ్మక్క గద్దె ను చేరుతుంది.శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకోగా శనివారం సాయంత్రం సమ్మక్క, సారలమ్మ లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.అయితే నాలుగు రోజులు జరిగే ఈ జాతరకు చుట్టూ పక్కల గ్రామాలైన వెంకటేశ్వర్ల పల్లి,జగ్గయ్యపేట,జూబ్లీనగర్,కొనరావుపేట,కొత్త పల్లి గోరి,రేగొండ,చెన్నాపురం తదితర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో జాతరకు తరలి వస్తారు.

ఇంకా పూర్తి కానీ పనులు.

అయితే బుధవారం నుండి జాతర ప్రారంభం కాగా పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సుమారు రూ.10 లక్షలతో గద్దెల పునరుద్ధరణకు నిధులు కేటాయించగా పునరుద్ధరణ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.అలాగే బుగులోని జాతరకు కేటాయించిన రోడ్డు పనులే అసంపూర్తిగా ఉన్నాయి. మినీ మేడారం కు వచ్చే భక్తులు అవే రోడ్లను ఉపయోగించుకోగా ఆ రోడ్లపై కంకర, మట్టి,సూర తో తేలి ఉన్నాయి.

దీంతో జాతరకు వచ్చే భక్తులకు దుమ్ము, ధూళితో రహదారులు ప్రాణ సంకటంగా మారాయి. ఇప్పటికైనా జాతర కమిటీ పనులు వేగవంతం చేసి భక్తులకు అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.