calender_icon.png 12 November, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్ రంజీ జట్టు

12-11-2025 12:00:00 AM

-తొలిసారి ఢిల్లీపై విజయం

-సొంతగడ్డపై ఢిల్లీకి పరాభవం

న్యూఢిల్లీ, నవంబర్ 11: రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న ఢిల్లీని ఓడించింది. 65 ఏళ్ళ తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఢిల్లీపై గెలవడం ఇదే మొదటిసారి. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జమ్మూ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిం ది. ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఢిల్లీని ఓడించడం అంటే సాధారణ విషయమేమీ కాదు. ఎందుకంటే రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌పై పెద్దగా అంచనాలు ఉండవు.

అయితే గత కొంతకాలంగా మాత్రం నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుత సీజన్‌లోనూ యువ క్రికెటర్లు, సీనియర్ ప్లేయర్స్‌తో కూడిన జమ్మూ అద్భుతమైన ఆటతీరుతో ఢిల్లీకి షాకిచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన  ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటవగా.. ఆయుశ్ బదౌనీ, దోసేజా, సుమిత్ మాథుర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. జమ్మూ బౌలర్లలో ఆకిబ్ నబీ 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కెప్టెన్ పరాస్ డోగ్రా సెంచరీ చేయడంతో జమ్మూ కాశ్మీర్ 310 పరుగులు చేసి 99 పరుగుల కీలక ఆధిక్యాన్ని అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్ 6 వికెట్లు తీసినా జమ్మూ ఆధిక్యాన్ని అడ్డుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 277 పరుగులకు ఆలౌటై.. 179 పరుగుల టార్గెట్‌ను ప్రత్యర్థి ముందుంచింది. దీంతో 179 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కాశ్మీర్ సునాయాసంగా ఛేదించింది.ఖమ్రాన్ ఇక్బాల్ 133 రన్స్‌తో జమ్మూను గెలిపించాడు.

బెంగాల్ చేతిలో రైల్వేస్ చిత్తు :

మరో మ్యాచ్‌లో బెంగాల్ రైల్వేస్‌ను ఇన్నింగ్స్ 120 రన్స్ తేడాతో చిత్తు చేసింది. మహ్మద్ షమీ లేకున్నా ఈ మ్యాచ్‌లో బెంగా ల్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 474 రన్స్ చేయగా.. మజుందార్ సెంచరీతో రాణించాడు. తర్వాత బెంగాల్ బౌలర్ల దెబ్బకు రైల్వేస్ 222 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది. ఫాలోఆన్‌లోనూ రైల్వేస్ కేవలం 132 పరుగులకే ఆలౌటైంది.

బెంగాల్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ 7 వికెట్లతో ఇన్నింగ్స్ విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్ లో మధ్యప్రదేశ్ 3 వికెట్ల తేడాతో గోవాపై గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో గోవా 294 పరుగు లకు ఆలౌటవగా.. మధ్యప్రదేశ్ 187 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో గోవా 230 రన్స్ చేయగా.. మధ్యప్రదేశ్ 328 పరుగుల టార్గెట్‌ను 7 వికెట్లు కోల్పోయి ఛేదిం చింది. ఇక రాజస్థాన్, హైదరాబాద్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.