12-01-2026 12:23:45 AM
ఇల్లందు టౌన్, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇల్లందు జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు గాదెపాక వికాస్, మద్ది సాయి కుమార్ ఆదివారం తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. పట్టణంలో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజల తరఫున గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.
ఇల్లందులో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా నిజాయితీ, పారదర్శక పాలనతో ముందుకు సాగుతామని అన్నారు. అదేవిధంగా, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావాలని కోరారు. రానున్న ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించి, పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను, బ్రహ్మం, శివ, సుఫియాన్ తదితరులు పాల్గొన్నారు.