calender_icon.png 4 November, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా 20 సినిమాల్లో జటాధర బెస్ట్ స్క్రిప్ట్

03-11-2025 02:39:53 AM

టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేశ్‌శకుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా కథానాయకుడు సుధీర్‌బాబు మాట్లాడుతూ.. “చాలామంది నన్ను నెపో కిడ్ అంటున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. సహాయం చేయడానికి మహేశ్‌బాబు సిద్ధంగా ఉన్నా, ఆయన్ను ఏనాడూ సహాయం అడగలేదు. కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ, ఫిలింనగర్ బాధలు తెలుసు. కళ్ల ఎదురుగా తిండి ఉండి, నిరాశతో ముద్ద దిగిన ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.

ఇవన్నీ నేను సానుభూతి కోసం చెప్పట్లేదు. అలా అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పేవాడిని. నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ ది బెస్ట్ స్క్రిప్ట్. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. కాకపోతే దెయ్యాలపై నాకు నమ్మకం ఉండదు. ధనపిశాచి నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ వెంకట్ అద్భుత సినిమాగా మలిచారు. దెయ్యాలు, దేవుడు ఉన్నాయని విశ్వసించేవారికి, లేవని నమ్మేవారికి.. ఇద్దరికీ సమానంగా ఈ సినిమా నచ్చుతుంది.

అరుణాచలం వెళ్లే వాళ్లు ఈ సినిమా ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతారు” అన్నారు. డైరెక్టర్లు శైలేష్ కొలను, యదువంశీ, ప్రొడ్యూసర్ విష్ణువర్ధన్‌తోపాటు ఈ చిత్ర నిర్మాతలు శివిన్, ప్రేరణ అరోరా, నటి శిల్పా శిరోద్కర్, సంగీత దర్శకుడు రాజీవ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.