calender_icon.png 14 May, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్ సీఎం రాజీనామా

04-07-2024 01:41:02 AM

గవర్నర్‌కు కలిసి లేఖ ఇచ్చిన చంపై సొరేన్

సీఎంగా పగ్గాలు మళ్లీ హేమంత్ చేతికి

ఐదు నెలల్లోనే ముగిసిన చంపై పదవీకాలం

రాంచి, జూలై 3: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సొరేన్ రాజీనామా చేశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖను అందించారు. త్వరలో రాష్ట్ర సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్రమాస్తుల కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్టు చేయటానికి ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. జనవరి ౨న చంపై సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ౫ నెలల జైలు జీవితం అనంతరం జూన్ ౨౮న హేమంత్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో మళ్లీ సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం చంపై నివాసంలో కూటమి నేతలు సమావేశమై హేమంత్‌ను మళ్లీ సీఎంను చేయాలని నిర్ణయించారు. 

చంపై మనస్తాపం

సీఎం మార్పుపై చంపై నివాసంలో బుధవారం జేఎంఎం, కాంగ్రెస్ నేతలు సమావే శమయ్యారు. కూటమి ఎల్పీ నేతగా హేమంత్‌ను ఎన్నుకోవటంతో చంపై తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని చంపై సొరేన్ అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీంతో చంపైని బుజ్జగించేందుకు ప్రయతాలు చేస్తున్నాయి. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించిన తర్వాత చంపై మీడియాతో మాట్లాడారు. ‘నాయకత్వం మారటంతో నా బాధ్యతలు అప్పగించా. గత ౫ నెలలుగా జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. హేమంత్ తిరిగి వచ్చిన తర్వాత సంకీర్ణ కూటమిని ఆయనను నాయకుడిగా ఎన్నుకొన్నది. అందువల్ల నేను రాజీనామా చేశాను.’ అని చంపై పేర్కొన్నారు.    

ఎన్నికల ముందు కీలక పరిణామం

జార్ఖండ్ అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. దీంతో బీజేపీని నిలువరించాలంటే హేమంత్ సొరేన్ సీఎంగా ఉండాలని సంకీర్ణ ప్రభుత్వ పార్టీలు భావిస్తున్నాయి.