04-07-2024 01:40:09 AM
చెన్నై, జూలై 3: కేంద్రం తమిళ ప్రజల మనోభావాలను గౌరవించాలని తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు, తమిళ హీరో విజ య్ సూచించారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపునివ్వాలని కోరారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని మొన్నీ మధ్యే స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కేవలం అధికారపక్ష ఎంపీలు మా త్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం విజయ్ కూడా డీఎంకే పార్టీ ఆమోదించిన బిల్లుకే సపోర్ట్ చేయడం గమనార్హం.
ఆ బాధ్యత కూడా రాష్ట్రానికే ఇవ్వాలి
విద్య ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉంది. కానీ విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 10,12 తరగతుల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందేనన్నారు. కేంద్రం తమిళ ప్రజల మనోభావాలను గౌరవించాలని యాక్టర్ విజయ్ అన్నారు. నీట్ పరీక్ష విద్యార్థుల విశ్వాసం కోల్పోయింది.. ఇక నీట్ పరీక్ష అవసరం ఎంత మాత్రం లేదన్నారు.